నిశ్శబ్ద వ్యాధి హైపర్‌టెన్షన్‌పై అప్రమత్తంగా ఉండాలి

Sakshitha news

నిశ్శబ్ద వ్యాధి హైపర్‌టెన్షన్‌పై అప్రమత్తంగా ఉండాలి…

ప్రపంచ హైపర్‌టెన్షన్ దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: ప్రపంచ హైపర్‌టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జిల్లా ఆసుపత్రిలో డా. కె. ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు అధిక రక్తపోటు వల్ల కలిగే ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు.

డా. ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ రక్తపోటు ఒక అసంక్రమిక నిశ్శబ్ద వ్యాధి అని, ఇది వచ్చిన విషయం చాలా మందికి తెలియదన్నారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రక్తపోటు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ప్రస్తుతం జీవనశైలి మార్పులు, మానసిక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, అధిక ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల హైపర్‌టెన్షన్ సమస్య వేగంగా పెరుగుతోందన్నారు. నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

హైపర్‌టెన్షన్ నివారణకు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలని, ఉప్పు, నూనె, జంక్ ఫుడ్ తగ్గించి పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అలాగే ధూమపానం, మద్యపానం పూర్తిగా మానుకోవాలని, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని తెలిపారు. బీపీ ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు మందులు క్రమం తప్పకుండా వాడుతూ తరచుగా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు.

“ఉప్పు తగ్గిద్దాం – బీపీ నియంత్రిద్దాం”, “మీ రక్తపోటు తెలుసుకోండి – మీ గుండెను కాపాడుకోండి” అనే నినాదాలతో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ప్రపంచ హైపర్‌టెన్షన్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి సమీప ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా బీపీ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ విజయ్, డాక్టర్ సుష్మిత, పాలియేటివ్ కేర్ వైద్య అధికారి డాక్టర్ హరి కిషన్, ఎన్‌సీడీ కోఆర్డినేటర్లు మధుసూదన్, తీట్ల రాజేశం, వి. శ్రీనివాస్, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top