మత్తు పదార్థాల నియంత్రణకు పెద్దపల్లి పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు…

Sakshitha news

మత్తు పదార్థాల నియంత్రణకు పెద్దపల్లి పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు…

నార్కోటిక్ స్నిఫర్ డాగ్‌తో బస్టాండ్, బస్సులు, పార్సిల్ కేంద్రాల్లో విస్తృత తనిఖీలు…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ ఏరియా, కార్గో పార్సిల్ కేంద్రాలు, దుకాణాలు, పాన్ షాపులతో పాటు పలు బస్సుల్లో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

పెద్దపల్లి టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, నార్కోటిక్ వింగ్ ఇన్‌స్పెక్టర్ ఎం. రాజ్‌కుమార్ సమన్వయంతో నిర్వహించిన ఈ తనిఖీల్లో అనంతరం పెద్దపల్లి ఐటీఐ కళాశాల పరిసరాలు, కళాశాల వెనుక ఖాళీ ప్రదేశాల్లో కూడా స్నిఫర్ డాగ్‌లతో తనిఖీలు కొనసాగించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గంజాయి సరఫరా, వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

మత్తు పదార్థాలు, గంజాయి, అలాగే చిన్నపిల్లలకు హానికరమైన మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్లు, గుట్కా, సిగరెట్లు వంటి నిషేధిత వస్తువులు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బస్టాండ్‌లో ప్రయాణికుల బ్యాగులను, అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసి వారి వివరాలను సేకరించినట్లు తెలిపారు. గంజాయి మరియు మత్తు పదార్థాలను బస్సులు, రైల్వే మార్గాలు, ప్రైవేట్ వాహనాలు, కార్ల ద్వారా తరలించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా మత్తు పదార్థాల సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసినా స్థానిక పోలీసులకు, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించిన పోలీసులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నార్కోటిక్ టీమ్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, పెద్దపల్లి టౌన్ ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, నార్కోటిక్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

Scroll to Top