జూలపల్లి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన, ప్రభుత్వ విప్ విజయ రమణారావు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి జిల్లాలో రైతులు తీసుకొచ్చిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్పష్టం చేశారు. జూలపల్లి మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించిన ఆయన, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, తూకాల నిర్వహణ, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు.
మార్కెట్ యార్డ్‌లో నిల్వ ఉంచిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే , జూలపల్లి సెంటర్ నుంచి తరలిస్తున్న లారీల ట్రాక్ షీట్లను తనిఖీ చేసి కొనుగోళ్లు పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ ఏడాది వరి దిగుబడి అధికంగా రావడంతో పాటు హార్వెస్టర్లు విస్తృతంగా వినియోగంలో ఉండటంతో ధాన్యం ఒకేసారి మార్కెట్‌కు చేరిందని చెప్పారు. అయినప్పటికీ కొనుగోళ్లలో ఎలాంటి అంతరాయం ఉండదని, అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచామని రైతులకు భరోసా ఇచ్చారు.
ధాన్యం కొనుగోళ్లపై కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించిన ఎమ్మెల్యే , రైతులు అధికారిక కొనుగోలు కేంద్రాల ద్వారానే ధాన్యం విక్రయించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలోనే కొనుగోళ్లు జరుగుతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
