విద్యా రంగంలో తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది

Sakshitha news

విద్యా రంగంలో తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది………. ఎమ్మెల్యే మెగా రెడ్డి
….

సాక్షిత వనపర్తి :
తెలంగాణను విద్యారంగంలో దేశంలో నెంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.

పెబ్బేరు పట్టణంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి లు ముఖ్య అతిథులుగా హాజరై మోడల్ అంగన్వాడీ కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

పెబ్బేరు మండలంలో ఏబిడి లిక్కర్ ఫ్యాక్టరీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రూ. 49 లక్షల నిధులతో మండల పరిధిలో 13 అంగన్వాడీ కేంద్రాలను ఆధునికరించి మోడల్ అంగన్వాడీ కేంద్రాలుగా తీర్చిదిద్దారు.

ప్రారంభించిన వాటిలో పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావుపల్లి మండల పరిషత్ పాఠశాల ఆవరణలో ఉన్న మోడల్ అంగన్వాడీ కేంద్రం, పెబ్బేరు లోని రెండో వార్డులో అంగన్వాడీ కేంద్రం, చెలిమిల్లలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా పెబ్బేరు పట్టణంలోని 2వ వార్డులో ఏర్పాటు చేసిన మోడల్ అంగన్‌వాడీ కేంద్రంలో ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో తెలంగాణను విద్యారంగంలో నెంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలిపారు. సన్న బియ్యం, మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంపు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్టుబడులు పెడుతోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలని కోరారు. అలాగే ఏబిడి కంపెనీ వారు సీఎస్ఆర్ నిధుల కింద రెండు శాతం నిధులను, పెబ్బేరు మండలంలో విద్యారంగం మరియు పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. పాఠశాలలకు కాంపౌండ్ వాల్, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా వారు చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏ బీడీ లిక్కర్ కంపెనీ ఆధ్వర్యంలో పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండల పరిధిలో 13 అంగన్వాడి కేంద్రాలను మోడల్ అంగన్వాడీ కేంద్రాలుగా తీర్చిదిద్దడం అభినందనీయమని తెలిపారు. ఈ సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాష్ట్ర క్రీడాపాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలను మోడల్ అంగన్వాడీలుగా తీర్చిదిద్దినందుకు ఏబీడీ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సౌకర్యాలను ప్రజలు సంరక్షించుకోవాలని బాగా వినియోగించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ఎబిడి లిక్కర్ కంపెనీ డైరెక్టర్ రాజేష్, కంపెనీ ప్రతినిధులు ఉమాశంకర్, వెంకటేశ్వర్ రెడ్డి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ సుమిత్ర, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top