రైతులు ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన- తహసిల్దార్ – అమీన్ సింగ్
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి:
మండల రైతులు ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఆత్మకూరు (ఎస్) మండల తహసిల్దార్ అమీన్ సింగ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని నిమ్మికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.కేంద్రంలో ధాన్యం తూకాలు, నమోదు ప్రక్రియ, రైతులకు అందిస్తున్న సౌకర్యాలు, ధాన్యం నిల్వ పరిస్థితులను ఆయన పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలని సూచించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వెంటనే తూకం వేసి ఆలస్యం లేకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ, విశ్రాంతి వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు ఆదేశించారు.
అయితే ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ప్రధాన సమస్యగా లారీల కొరత తీవ్రంగా ఉందని కేంద్ర నిర్వాహకులు తహసిల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. ధాన్యం కొనుగోలు అయినప్పటికీ తరలింపుకు సరిపడా లారీలు అందుబాటులో లేకపోవడంతో కేంద్రాల్లో భారీగా ధాన్యం రాశులు పేరుకుపోతున్నాయని తెలిపారు. దీనివల్ల రైతులు రోజులు తరబడి కేంద్రాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కూడా ఇదే సమస్యను ప్రస్తావిస్తూ వెంటనే లారీలను పంపించి ధాన్యాన్ని మిల్లులకు తరలించే చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికే పలు కేంద్రాల్లో నిల్వలు పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని రైతులు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లారీల కొరత సమస్య పరిష్కారమైతే కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తహసిల్దార్ అమీన్ సింగ్ సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

