“గోదావరిఖనిలో సెంట్రల్ లైబ్రరీకి డిమాండ్ డీఎంఎఫ్ నిధులు ఉన్నా పనులు నిలిచిపోయాయన్న ఆవేదన…”

Sakshitha news

గోదావరిఖనిలో సెంట్రల్ లైబ్రరీకి డిమాండ్ డీఎంఎఫ్ నిధులు ఉన్నా పనులు నిలిచిపోయాయన్న ఆవేదన…”

సాక్షిత పెద్దపల్లి/గోదావరిఖని:
విద్యార్థి యువతలో జ్ఞానాన్ని పెంపొందించేందుకు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ మేరకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ, మైనింగ్ ప్రభావిత జిల్లాల అభివృద్ధి కోసం కేటాయించిన జిల్లా ఖనిజ ఫౌండేషన్ (డీఎంఎఫ్) నిధులను సమర్థవంతంగా వినియోగించి గోదావరిఖనిలో ఆధునిక సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా కోరుతున్నప్పటికీ స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. సింగరేణి కార్మిక కుటుంబాల పిల్లలు, స్థానిక యువత ఉద్యోగాల కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై ఆధారపడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా డీఎంఎఫ్ నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో, గోదావరిఖని వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యా సదుపాయాల పెంపు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. “చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో” అనే నానుడిని ఉటంకిస్తూ, పుస్తకాల ప్రాముఖ్యతను గుర్తుచేశారు.

ఈ నేపథ్యంలో డీఎంఎఫ్ నిధులతో తక్షణమే స్థలాన్ని కేటాయించి సెంట్రల్ లైబ్రరీ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.
అనంతరం జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌కు సుమారు రూ.60 లక్షల నిధులు కేటాయించినప్పటికీ, స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదని తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Scroll to Top