గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి…
పాఠశాలల పెండింగ్ పనులు 15 రోజుల్లో.. కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లు నెల రోజుల్లో పూర్తి చేయాలి….
— కలెక్టర్ కోయ శ్రీహర్ష….
సాక్షిత పెద్దపల్లి -జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/ : రామగుండం ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ పలు ప్రభుత్వ పాఠశాలలు, అల్లూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, లక్ష్మీపురం–వీర్లపల్లి రహదారి అభివృద్ధి పనులను పరిశీలించారు.
పాఠశాలల్లో పనులపై ప్రత్యేక దృష్టి
రామగుండం మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మార్కండేయ కాలనీ గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాల, అడ్డగుంటపల్లి, సంజయ్‌నగర్, అల్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, నరసింహపురం (న్యూ మారేడుపాక) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వీర్లపల్లి, చైతన్యపురి, 46వ డివిజన్ శాంతినగర్ పాఠశాలలను కలెక్టర్ పరిశీలించారు.
పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, భవనాల పరిస్థితి, మరమ్మతులు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. గోదావరిఖని ఉర్దూ మీడియం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీ-ప్రైమరీ తరగతి గదిని ప్రారంభించారు.
పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పునరుద్ధరణ పనులను 15 రోజుల్లోగా, కిచెన్ షెడ్లు, మరమ్మతులు, మరుగుదొడ్ల పనులను నెల రోజుల్లోగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
అల్లూరు యూపీహెచ్‌సీలో ఎన్సీడీ స్క్రీనింగ్ పెంచాలి
అనంతరం అల్లూరు యూపీహెచ్‌సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న వైద్య సేవలు, వైద్యుల అందుబాటు, ఓపీ సేవలు, ఎన్సీడీ స్క్రీనింగ్ తదితర అంశాలను పరిశీలించారు.
ఎన్సీడీ స్క్రీనింగ్ తక్కువగా ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్, అర్హులైన ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ నిర్వహించి స్క్రీనింగ్ శాతాన్ని పెంచాలని ఆదేశించారు. వైద్యులు నిర్ణీత సమయానికి విధులకు హాజరై ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మూడు నెలల్లో లక్ష్మీపురం–వీర్లపల్లి రహదారి పూర్తి
లక్ష్మీపురం నుంచి వీర్లపల్లి వరకు జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనుల పురోగతిని తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రహదారి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి, ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రహదారుల అభివృద్ధి పనులను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్, డిప్యూటీ ఇంజనీర్ మారుతి, ఏఈ నరేష్, యూపీహెచ్సీ వైద్యురాలు దివేన, ఆర్అండ్బీ ఏఈ జావిద్ తదితర అధికారులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST