కాంగ్రెస్ 1000 రోజుల పాలనంతా మోసమే…

Sakshitha news

కాంగ్రెస్ 1000 రోజుల పాలనంతా మోసమే…

హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం.. ప్రజలకు తీరని అన్యాయం….

– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, ధర్మారం/ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వంటా–వార్పు’ నిరసన కార్యక్రమానికి ఆయన నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నా ఏ వర్గానికి ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500 భృతి, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు వంటి హామీలను పక్కనపెట్టి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో అమలైన బీసీ బంధు, ఎస్సీ బంధు, కేసీఆర్‌ కిట్‌, పెన్షన్ల పెంపు వంటి సంక్షేమ పథకాలను నిలిపివేసి పేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదని, మూడేళ్ల కాలానికి ఒక్కో మహిళకు సుమారు రూ.82,500 వరకు బకాయి పడినట్లేనని పేర్కొన్నారు.

వృద్ధులకు రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని, దివ్యాంగుల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతుబంధు, ఉచిత విద్యుత్‌, సాగునీటి సౌకర్యాలతో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం లభించిందని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో యూరియా కొరత, నీటి ఎద్దడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు.

గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనని కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ప్రస్తుతం సరైన పర్యవేక్షణ లేక పాఠశాలల్లో మౌలిక వసతులు క్షీణించాయని, అడ్మిషన్లు తగ్గి బడులు మూతపడే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

ధర్మారం ప్రాంతానికి సంబంధించి బొమ్మరెడ్డిపల్లి ఎక్స్టెన్షన్‌ కెనాల్‌ కోసం గతంలో రూ.19 కోట్లు మంజూరు చేసి పత్తిపాక, కొత్తపల్లి, బొమ్మరెడ్డిపల్లి గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించే పనులు చేపట్టామని, ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను పక్కన పెట్టడం ద్వారా స్థానిక రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చే వరకు గ్రామగ్రామాన నిరసనలు కొనసాగిస్తామని కొప్పుల ఈశ్వర్‌ హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజలు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.