ఆగస్టు 27న గ్రామ సభలు, వార్డు సభలు

Sakshitha news

ఆగస్టు 27న గ్రామ సభలు, వార్డు సభలు
ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి….

— రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి…

సాక్షిత పెద్దపల్లి పెద్దపల్లి, :
ఆగస్టు 27న రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు, మ్యాపింగ్ కాని, అనామలీస్ గుర్తించిన ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు 27న గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ భవనాల్లో, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని తెలిపారు. బీఎల్‌ఓలు, ఎన్నికల సంబంధిత సిబ్బంది సభల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సభల నిర్వహణపై బీఎల్‌ఓల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఫారం-6, ఫారం-7, ఫారం-8 తదితర అవసరమైన ఫారాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలోని పేర్లను సభల్లో చదివి వినిపించాలని, అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేని భారతీయ పౌరులను గుర్తించాలని తెలిపారు.

2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే వారు ఫారం-6తో పాటు డిక్లరేషన్, అవసరమైన ఆధారాలు సమర్పించి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఓటరు జాబితాలో పేరు లేదా వివరాల్లో తప్పులు ఉంటే ఫారం-8 ద్వారా సవరణకు దరఖాస్తు చేసుకునేలా వివరించాలని సూచించారు. అర్హత లేకపోయినా పేరు నమోదై ఉన్నట్లు గుర్తిస్తే ఫారం-7 ద్వారా అభ్యంతరాలు సమర్పించేలా ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.

మ్యాపింగ్ కాని, అనామలీస్ గుర్తించిన ఓటర్లందరికీ నోటీసులు జారీ చేయాలని, ప్రతి నోటీసులో విచారణ తేదీ, సమయం, ప్రదేశాన్ని స్పష్టంగా పేర్కొనాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. నోటీసు జారీ చేసిన తేదీకి, విచారణ తేదీకి మధ్య కనీసం ఏడు రోజుల వ్యవధి ఉండేలా చూడాలని సూచించారు. నోటీసుల జారీ వివరాలను బీఎల్‌ఓ యాప్‌లో ఫొటోలతో సహా నమోదు చేయడంతో పాటు, విచారణకు సంబంధించిన వివరాలు, ఓటర్లు సమర్పించిన ఆధారాలను కూడా యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇంకా సుమారు 10 వేల నోటీసులు జనరేట్ చేయాల్సి ఉందని, పెండింగ్ నోటీసుల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 27న నిర్వహించే గ్రామ సభలు, వార్డు సభలను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ, డ్రాఫ్ట్ ఓటరు జాబితా, క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ తదితర అంశాలపై మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.

అర్హత కలిగిన ప్రతి ఓటరు ఓటు హక్కును పరిరక్షించే విధంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో గంగయ్య, ఈ-సెక్షన్ సూపరింటెండెంట్ విజయ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top