ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు..

Sakshitha news

ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు….

విద్యార్థులకు పోషకాహార అల్పాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం….

— మంత్రి శ్రీధర్ బాబు….

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, మంథని/ : పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని, ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించి వారి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

మంథనిలో సింగరేణి సీఎస్‌ఆర్ నిధులతో సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కిచెన్‌లో తయారు చేసిన అల్పాహారాన్ని విద్యార్థులతో కలిసి స్వీకరించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో తొలుత కొడంగల్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ పథకం అమలుతో అక్కడ విద్యార్థుల హాజరు 21 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొడంగల్‌తో పాటు మధిరలోనూ ఈ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.

మంథనిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్‌లో ఆధునిక యంత్రాల సహాయంతో గంటకు 10 వేల ఇడ్లీలు, 3 వేల దోసెలు, 5,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం ఉందన్నారు. విద్యార్థులకు ప్రతిరోజూ విభిన్న రకాల అల్పాహారం అందించేలా ప్రత్యేక మెనూను రూపొందించామని, వారానికి కనీసం మూడు సార్లు పాలు అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.

పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా విద్యార్థులు మంచి ఆరోగ్యంతో పాటు చదువుపై మరింత ఏకాగ్రత సాధిస్తారని అన్నారు. ఏ విద్యార్థి ఆకలితో పాఠశాలకు రాకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు జిల్లాలో విద్యాశాఖకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యాశాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలులో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారం ఉచితంగా అందిస్తున్నందున తల్లిదండ్రులు ఎలాంటి సందేహాలు లేకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆర్‌జీ-3 జీఎం, తహసీల్దార్ ఆరిపోద్దిన్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top