ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. అధికారులకు తక్షణ పరిష్కార ఆదేశాలు

Sakshitha news

ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. అధికారులకు తక్షణ పరిష్కార ఆదేశాలు

–అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/ : ప్రజావాణిలో ప్రజల నుంచి అందే ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సంబంధిత అధికారులను ఆదేశించారు.

పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించిన అనంతరం సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పెద్దపల్లి పట్టణానికి చెందిన ఏ. ఫాతిమా తాము 30 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నామని, తమకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై పీడీ హౌసింగ్‌కు లేఖ రాసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.

పాలకుర్తి మండలం ఎలుకలపల్లి గేటు గ్రామానికి చెందిన ధర్మపురి శిరీష తాను ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేశానని, కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత అధికారులకు లేఖ రాసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన బర్ల బాపు సర్వే నంబర్ 119లో ఉన్న రెండు ఎకరాల 25 గుంటల వ్యవసాయ భూమికి పట్టా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ముత్తారం తహసీల్దార్‌కు లేఖ రాసి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ సూచించారు.

పెద్దపల్లి మండలం బండారికుంట గ్రామానికి చెందిన నేరెళ్ల లత వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి లేఖ రాసి, నూతన అర్హతల మేరకు పింఛన్ మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ బి. ప్రకాష్‌తో పాటు సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top