మంగళం డిపోను ప్రైవేటుకిస్తే ప్రజా ఉద్యమం
** సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: కోట్ల రూపాయల విలువచేసే మంగళం డిపోకు చెందిన 10 ఎకరాల స్థలాన్ని పూలేకి చెందిన పినాకిల్ సంస్థకు అమ్మే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి తీవ్రంగా ప్రశ్నించారు. మం ఉదయం మంగళం డిపోను సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్.జయచంద్ర, కోశాధికారి ఈఎస్ కుమార్ లతో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో దాదాపు 20వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీకి సంబంధించిన స్థిర ఆస్తులను ప్రైవేటుపరం చేయడానికి కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని, కార్మికులంతా ప్రజల మద్దతుతో ఐక్య పోరాటం చేస్తే భవిష్య తరాలకు ఆర్టీసీ ఆస్తులను నిలిపిన వారమౌతామని కందారపు మురళి కార్మికులకు పిలుపునిచ్చారు. పర్యావరణహితం పేరుతో ప్రజా రవాణా వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులచే ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చిన ప్రభుత్వం, నేడు ఆ ఎలక్ట్రిక్ బస్సులకు సౌకర్యాల పేరిట ప్రభుత్వ వినియోగంలో ఉన్న డిపోలను, గ్యారేజీలలో సగభాగాన్ని పూణెకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ పినాకిల్ కు దాదాపు 100 కోట్ల విలువైన మంగళం డిపోను దారాదత్తం చేయడానికి ప్రభుత్వం మార్గ నిర్దేశకాలు ఇచ్చిందన్నారు.
భవిష్య తరాలకు, వందల మంది కార్మికులకు ఉపాధి నిచ్చే ఇటువంటి డిపోలను అభివృద్ధి చేయాల్సింది పోయి ప్రైవేటుపరం చేయడం సమంజసం ఎంత మాత్రమూ కాదన్నారు.
ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకం ద్వారా దశలవారీగా 3 వేల బస్సులను ఏర్పాటు చేయడానికి గాను రాష్ట్రవ్యాప్తంగా… వేల కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోలకు చెందిన స్థలాలను ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకుందన్నారు. ఈ-బస్ డిపోల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు కేటాయించుకోకుండా ఉపయోగంలో ఉన్న ఆర్టీసీ ఆస్తులను ఇవ్వడం పట్ల ప్రభుత్వ తీరుపై కందారపు మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు.
2029 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను నడపడానికి ప్రభుత్వం దృష్టి సారించిందని, కానీ ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 9 వేల మంది కార్మికులు రోడ్డున పడతారని, గతంలో టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా ఉన్న ఆర్టీసీ వర్క్ షాప్ ను కాపాడుకోవడానికి సిఐటియు ఆధ్వర్యంలో రెండేళ్ల పాటు పోరాటం చేశామని, ఐక్య పోరాటం లేని కారణంగానే ఆ వర్క్ షాపు వేరొక ప్రాంతానికి తరలించేశారన్నారు. అన్ని
కార్మిక సంఘాలు, డిపోల యూనియన్లు కలిసి ఒక్కతాటిపైకి వచ్చి ప్రైవేటుపరం కాబోతున్న ప్రజలకు సంబంధించిన ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడడానికి కార్మికులు చేసే పోరాటానికి పూర్తిస్థాయి మద్దతు సిఐటియు తరపున అందిస్తూనే కార్మికుల వెంట నిలబడి పోరాడుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యుఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్ఎస్ మన్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, ఎస్డబ్ల్యుఎఫ్ మంగళం డిపో అధ్యక్షులు వి.మురళి, జన విజ్ఞాన వేదిక కార్యదర్శి ఎస్.రెడ్డప్ప, మంగళం డిపో సిబ్బంది, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

