కపిలతీర్థంలో మహాశివరాత్రి
** ఎల్లుండి వేకువజామున లింగోద్భవ అభిషేకం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీకి చెందిన తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం (రేపు) మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.
మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం తెల్లవారు జామున 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రథోత్సవం(భోగితేరు), ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ జరుగనున్నాయి. అలాగే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. 16వ తేదీ సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.
16న శివపార్వతుల కల్యాణం
శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన సోమవారం శివపార్వతుల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) అప్పటికప్పుడు రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

