అసెంబ్లీలో PPT కు భయమెందుకు?
అవకాశం ఇస్తే కాంగ్రెస్ బండారం బయటపెడతాం: జగదీష్ రెడ్డి
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT)కు అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ను నిరాకరించడం వెనుక కాంగ్రెస్ భయమే కారణమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్ర నల్లమల సాగర్ పేరుతో సాగుతున్న నీటి దోపిడీపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, అవకాశం ఇస్తే కాంగ్రెస్ అసలు బండారం బయటపడుతుందని స్పష్టం చేశారు. “PPT పెట్టేందుకు మేము అవకాశం అడిగితే భయమెందుకు? అసెంబ్లీలో మీరు కూడా PPT పెట్టండి… మాకూ అవకాశం ఇవ్వండి. తెలంగాణలో అసలు దొంగలెవరో ప్రజల ముందుకు వస్తారు. ఆనాడు మీరు అడ్డుకున్నట్టు మేము అడ్డుకోం.
కానీ మాకు అవకాశం ఇవ్వకపోవడం వెనుక మీ బాగోతం బయటపడుతుందన్న భయమే ఉంది” అని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పాలనలో జరిగిన తప్పిదాలను వారి స్క్రీన్‌పైనే ప్రజలకు చూపిస్తామని ఆయన అన్నారు. “బీఆర్ఎస్ అడిగిన PPTకి మొండిచేయి చూపడమే కాంగ్రెస్ అసలు రంగును చెప్పకనే చెబుతోంది. అవకాశం ఇస్తే నీటి వాటాల విషయంలో రేవంత్ చేస్తున్న ద్రోహాన్ని పూర్తిగా ఎండగడతాం. PPTకి అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి బహిర్గతం చేస్తాం” అని హెచ్చరించారు. శాసనసభలో అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. “రాష్ట్రంలో మళ్లీ పాత పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆనాడు అరవై ఏండ్లు ఏం చేశారో చెప్పాలి… ఇప్పుడు రెండేళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి. పక్క రాష్ట్రాలకు లాభపడే విధంగా పాలన కొనసాగుతోంది” అని విమర్శించారు. నల్లమల సాగర్ పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని, ఇది బనక చర్ల ప్రాజెక్ట్‌కే మరో రూపమని జగదీష్ రెడ్డి ఆరోపించారు.
“పేరు మార్చి చంద్రబాబు మరో ద్రోహం చేస్తుంటే, దానికి రేవంత్ సహకరిస్తున్నారు. పక్క రాష్ట్రాల నీటి దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవడం దుర్మార్గం” అని అన్నారు. ఢిల్లీకి పంపిన కమిటీలో చంద్రబాబు సూచించిన అధికారిని నియమించడం ద్వారా తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. “నీటి వాటాల కోసం కేసీఆర్ ఉద్యమం చేసి సాధించిన హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేస్తున్నారు. ఈ తీరుతో కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ నీటి వాటా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది” అని హెచ్చరించారు. ఉద్యోగాల విషయంలోనూ ఆంధ్ర అధికారుల పెత్తనం సరికాదని జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. “తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. ఆ త్యాగాలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది” అని విమర్శించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టక తప్పదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

