నియోజకవర్గంలోని 38 హైస్కూళ్ల క్రీడా మైదానాల అభివృద్ధికి ఒక్కో స్కూల్ కు రూ. 5 లక్షల చొప్పున నిధులు
…..
సాక్షిత : శివపురం బాలికల కళాశాల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు
…..
డివిజన్ స్థాయి ఉపాధ్యాయ క్రీడలను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు *
నర్సీపట్నం : చదువుతో పాటు క్రీడలు, శారీరక దృఢత్వం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో అవసరమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. నర్సీపట్నం డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలను శివపురం బాలికల రెసిడెన్షియల్ కళాశాల ప్రాంగణంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల సంక్షేమం కోసం రెండు కీలక వరాలను ప్రకటించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా ప్రమాణాలను పెంచేందుకు, తన మిత్రుల సహకారంతో సి.ఎస్.ఆర్ (CSR) నిధుల కింద నియోజకవర్గంలోని 38 హైస్కూళ్లకు ఒక్కో పాఠశాలకు రూ. 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో క్రీడా మైదానాలను అభివృద్ధి చేసి, పిల్లలకు అవసరమైన వాలీబాల్, క్రికెట్ వంటి క్రీడా సదుపాయాలను కల్పించాలని సూచించారు. వచ్చే రెండు మూడు నెలల్లో ఈ నిధులు అందుతాయని హామీ ఇచ్చారు.
అలాగే, క్రీడలు జరుగుతున్న శివపురం బాలికల కళాశాల మైదానానికి వెళ్లేందుకు సరైన రహదారి లేక ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని గమనించిన స్పీకర్ , తక్షణమే తారు రోడ్డు నుండి కాలేజీ లోపల కెనాల్ వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షాకాలంలో బురద సమస్య లేకుండా, విద్యార్థులకు మరియు సిబ్బందికి ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
స్పీకర్ తన ప్రసంగంలో మాట్లాడుతూ, 1983లో తాను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నర్సీపట్నంలో డిగ్రీ కాలేజీ కూడా లేదని, ఎన్టీఆర్ గారి సహకారంతో డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఐటీఐ మరియు నర్సింగ్ కాలేజీలను తీసుకువచ్చి నర్సీపట్నాన్ని విద్యా కేంద్రంగా మార్చానని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు నేడు సింగపూర్, లండన్, అమెరికా వంటి దేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని, అది తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. చదువు మనిషిని ఎక్కడికైనా తీసుకువెళుతుందని, ఆస్తులు పోయినా చదువు మనతోనే ఉంటుందని హితవు పలికారు.
పాఠశాలల్లో ప్రతిరోజూ ఉదయం అరగంట పాటు విద్యార్థులకు యోగా నేర్పించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ సూర్యచంద్ర, మాజీ కౌన్సిలర్ పైల గోవిందు, 12 మండలాలకు చెందిన ఎంఈఓ లు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

