టీటీడీలో స.హ.చట్టం అమలైతేనే అవినీతికి చెక్
** ఇన్చార్జి అధికారులను వెంటనే తొలగించాలి
** బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్ సూచన
…..
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువులతో ముడిపడిన టీటీడీ ధార్మిక సంస్థలో మొట్టమొదటగా వెంటనే సమాచార హక్కు చట్టాన్ని (స.హ.చట్టం) అమలు చేస్తేనే అవినీతికి చెక్ పడుతుందని బీజేపీ సీనియర్ నేత పి.నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. టీటీడీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కీలకమైన సూచనలు చేస్తూ గురువారం ఆయన తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నవీన్ మాట్లాడుతూ టీటీడీలో కీలక విభాగాలకు నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన అధికారులను నియమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందులో ముఖ్యంగా సమాచార హక్కు చట్టం అమలులోకి వస్తే సిబ్బంది లో…, ఉద్యోగుల్లో…, అధికారుల్లో…. చివరకు సంస్థ పాలకుల్లో కూడా బాధ్యత, భయం పెరుగుతాయని పేర్కొన్నారు.
భక్తులు భగవంతునికి సమర్పించే కానుకలతో వేలాదిమంది ఉద్యోగస్తులు, విద్యా – వైద్య సదుపాయాలు అందిస్తున్నారనే భక్తితో శ్రీవారి భక్తులు టీటీడీకి కోట్లలో నిధుల విరాళాలు ఇస్తారని చెప్పారు. ఆ విరాళాల వినియోగంపై (శ్రీవారి అభరణాలు, డిపాజిట్ల వివరాలు తప్ప) రాతపూర్వకంగా అడిగితే టీటీడీ కచ్చితంగా సమాధానం ఇచ్చేలా ప్రస్తుత ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేయాలని నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మరీ ముఖ్యంగా అయితే టీటీడీ మార్కెటింగ్, ఇంజనీరింగ్, లా డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్, క్యాటరింగ్ డిపార్ట్మెంట్ చాలా కీలకమైన విభాగాలని…. అలాంటి వాటిపై టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, ఐఏఎస్ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇంచార్జ్ అధికారులను వెంటనే తొలగించి రెగ్యులర్ ఉద్యోగస్తుల నియామకాలు చేపట్టాలన్నారు. టీటీడీలో అధికారుల లోటు కారణంగా అవినీతికి మూలం అవుతోందని తెలిపారు.
అంతేగాక రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్య పదవీ విరమణతో రోజు రోజుకి గణనీయంగా తగ్గిపోవడం, నూతన ఉద్యోగ నియామకాలపై టీటీడీ బోర్డు, ఈఓలు దృష్టి సారించకపోవడమే అవినీతికి మూల కారణంగా నవీన్ వివరించారు. అలాగే
అనేక సంవత్సరాలుగా టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాల పాపాల పుట్ట ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థల రంగ ప్రవేశంతో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. అయితే టీటీడీలో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు.
టీటీడీ ఉద్యోగస్తులు తప్పు చేస్తే మాత్రం వెంటనే “సస్పెండ్” చేస్తారని… మరి ధర్మకర్తల మండలి, అలాగే ప్రభుత్వాలు మారినప్పుడు డిప్యూటేషన్ పై వచ్చే ఐఏఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు చేసే తప్పులకు కూడా కఠిన శిక్షలు ఉండాలని భక్తులు కోరుకుంటున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా 20 సంవత్సరాల క్రితం టీటీడీ మార్కెటింగ్ విభాగానికి “మార్కెటింగ్ అధికారి” ఉండేవారని… కాలక్రమేనా ఆ అధికారి స్థానంలో ఉప కార్యనిర్వహణాధికారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో మార్కెటింగ్ విభాగాన్ని నడిపించడంతో పని భారం ఎక్కువై… పర్యవేక్షణ తక్కువై కింద స్థాయి సిబ్బంది ముడి సరుకుల సరఫరా కాంట్రాక్టర్లతో చేతులు కలిపి చేతివాటం ప్రదర్శించడం జరుగుతుందన్నారు.
అలాగే గత 20 సంవత్సరాలుగా టీటీడీలో సంక్షేమ అధికారి సైతం లేకపోవడంతో ఉద్యోగులకు కష్టకాలంలో ఆదుకునే సంక్షేమ నిధిని మూసేయడం జరిగిందన్నారు. టీటీడీని “కాగ్” పరిధిలోకి తీసుకుని వచ్చే చర్యలపై సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని, దీని ద్వారా అవినీతిని అరికట్ట వచ్చునని నవీన్ పేర్కొన్నారు. టీటీడీకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న స్థిర, చరాస్తులకు సంబంధించి న్యాయపరమైన కేసులు ప్రత్యక్షంగా పర్యవేక్షించుటకు అత్యంత కీలకమైనటువంటి
లా డిపార్ట్మెంట్ పర్యవేక్షణ కు జిల్లా జడ్జి స్థాయిలో టిటిడి న్యాయాధికారిగా గతంలో నియమిస్తూ ఉన్నది. ఈ న్యాయ విభాగంలో ఉన్న అధికారి కాలం పూర్తి కావడంతో ప్రస్తుతం ఉన్న ఓఎస్డికి అదనపు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు. వెంటనే కోర్టులో ఉన్న ముఖ్యమైన కేసుల పరిశీలనకు టీటీడీ లా ఆఫీసర్ ను నియమించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

