పురోగతిపై సమీక్ష.. హెల్ప్ డెస్క్‌ల ద్వారా ఓటర్లకు సహాయం అందించాలని అధికారులకు సూచన…
–నగర మేయర్ మహంకాళి స్వామి…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: రామగుండం, ప్రత్యేక ఓటరు నమోదు సవరణ ప్రక్రియను నిర్ణీత కాలవ్యవధిలో వంద శాతం పూర్తి చేసేందుకు పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సూచించారు.
నగర పాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), మున్సిపల్ కమిషనర్ జె. అరుణశ్రీతో కలిసి ప్రత్యేక ఓటరు నమోదు సవరణ ప్రక్రియతో పాటు పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు సవరణ ప్రక్రియ పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), మున్సిపల్ కమిషనర్ జె. అరుణశ్రీ మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీలోపు ప్రత్యేక ఓటరు నమోదు సవరణ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో బూత్ స్థాయి అధికారులతో పాటు వార్డు అధికారులు, సహాయకులకు కూడా బహుళ ప్రవేశ అనుమతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఆన్‌లైన్ నమోదు ప్రక్రియతో పాటు ఎన్యూమరేషన్ ఫారాలు భర్తీ చేయడంలో కూడా ఓటర్లకు సహకరించాలని సూచించారు. అలాగే ప్రత్యేక ఓటరు నమోదు సవరణకు సంబంధించిన హెల్ప్ డెస్క్ సేవలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, సహాయ పోలీసు కమిషనర్ శ్రీహరి, కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, పట్టణ ప్రణాళిక విభాగ అధికారి నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

