సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులను అప్రమత్తం చేయాలి….

Sakshitha news

సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులను అప్రమత్తం చేయాలి….

ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి…

–మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి,
సూపర్ ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు విస్తృత అవగాహన కల్పించి, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగుపై మార్గనిర్దేశం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

సూపర్ ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలోని వర్షపాతం పరిస్థితులు, జలాశయాల్లో నీటి నిల్వలు, ఖరీఫ్ పంటల ప్రణాళికపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, జూలై 9 నాటికి రాష్ట్రంలో 15 శాతం వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో నీటి నిల్వలు గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గాయని, ఎగువ రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వరద ప్రవాహం రాలేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపడా నీరు ఉందని, ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు కూడా వరదలు రాలేదని తెలిపారు. వచ్చే వారం రోజులపాటు భారీ వర్షాల అవకాశాలు కూడా లేవని వాతావరణ శాఖ అంచనా వేసినట్లు చెప్పారు.

సాగునీటి లభ్యత లేని ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేయవద్దని స్పష్టమైన సందేశం ఇవ్వాలని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను విస్తృతంగా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. రైతు వేదికలు, ప్యాక్స్‌ల ద్వారా నీటి లభ్యత, వర్షపాతం అంచనాలపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, జూలై 15 తర్వాత జలాశయాల్లో నీటి నిల్వలను సమీక్షించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా విత్తనాల సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదలు వచ్చిన వెంటనే నీటిని ఎత్తిపోసే ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని, అప్పటి వరకు అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ, సూపర్ ఎల్‌నినో పరిస్థితులను సవాలుగా కాకుండా అవకాశంగా మలుచుకోవాలని సూచించారు. జిల్లాల్లో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యతనిస్తూ ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమకు అనుకూల పంటలు, తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలని ఆదేశించారు. రైతులకు వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి శ్రీమాలతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top