గోదావరిఖనిలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి..

Sakshitha news

గోదావరిఖనిలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

పోలీస్ కమిషనర్‌ను కోరిన స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, గోదావరిఖనిలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు మద్దెల దినేష్, ఉపాధ్యక్షురాలు గొలివాడ చంద్రకళ, కార్యదర్శులు కొంకటి రవి గౌడ్, కంది సుజాత తదితరులు కమిషనర్‌ను కలిసి మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం మద్దెల దినేష్, గొలివాడ చంద్రకళ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి, హోంమంత్రిని కలిసి గోదావరిఖనిలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరగా సానుకూల స్పందన లభించి మంజూరు కూడా జరిగిందని తెలిపారు. పాత 1వ. టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మహిళా పోలీస్ స్టేషన్‌కు బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ, అనంతరం పనులు నిలిచిపోయి ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రతిపాదన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తరలిపోయిందని పేర్కొన్నారు.

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మహిళలపై వేధింపులు, గృహహింస, కట్న వేధింపులు, ప్రేమ పేరుతో మోసాలు, లోన్ యాప్‌ల వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్, సోషల్ మీడియా ద్వారా వేధింపుల వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గోదావరిఖనిలో ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అత్యవసరమని వారు వివరించారు.

మహిళలకు త్వరితగతిన న్యాయం అందించడంతో పాటు భద్రతను మరింత బలోపేతం చేయడానికి గోదావరిఖనిలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల సభ్యులు వై. లెనిన్, మండల శ్రీనివాస్, కొండూ రామతో పాటు పలువురు పాల్గొన్నారు.

Scroll to Top