విద్యను వ్యాపారంగా మార్చితే ఉద్యమం తప్పదు – ఏఐఎస్ఎఫ్ హెచ్చరిక…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులు, తల్లిదండ్రులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై ఉద్యమాలు, నిరసనలు చేపడతామని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం హెచ్చరించారు.
నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అనేక ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అడ్మిషన్ పేరుతో చట్టవిరుద్ధంగా భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ది తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ (రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ) యాక్ట్–1983 ప్రకారం అడ్మిషన్ ఫీజులు వసూలు చేయరాదని స్పష్టంగా ఉన్నప్పటికీ, రూ.2,000 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే, పాఠ్యపుస్తకాల విక్రయంలోనూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారని, తక్కువ ధరకు లభించే పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. ఎస్‌సీఈఆర్‌టీ నిర్దేశించిన సిలబస్‌కు బదులుగా అవసరం లేని అదనపు పుస్తకాలను విద్యార్థులపై రుద్దుతున్నారని, దీంతో విద్యార్థులపై మానసిక, శారీరక భారం పెరుగుతోందని అన్నారు.
ఫీజుల నియంత్రణ చట్టం, ప్రభుత్వ జీవోలు, విద్యాశాఖ మార్గదర్శకాలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించిన ప్రీతం, ఫిర్యాదులు వచ్చినప్పటికీ స్పందించని మండల, జిల్లా విద్యాధికారులపై చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇకపై నిబంధనలు ఉల్లంఘిస్తూ విద్యా వ్యాపారం కొనసాగించే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు, దాడులు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మొలుగూరి నితిలేష్, జిల్లా కోశాధికారి ఎల్కపల్లి సురేష్, రామగుండం మండల అధ్యక్షుడు మాతంగి సాగర్, ధనాల దినేష్, తడిగొప్పుల సాయి అనుప్, గండ్రెటి శివ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు

