మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు

Sakshitha news

మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు…

ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి…

— మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: తాండూర్, విద్యార్థులు గంజాయి, మాదక ద్రవ్యాలు సహా అన్ని రకాల మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండి, ఉన్నత లక్ష్యాలతో విద్యాభ్యాసం కొనసాగించాలని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ సూచించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర పాఠశాలను డీసీపీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, చదువుకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మత్తు పదార్థాల వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.

విద్యార్థులకు ఏదైనా సమస్య ఎదురైనా వెంటనే ఉపాధ్యాయులు, వసతి గృహ వార్డెన్ లేదా తల్లిదండ్రులకు తెలియజేయాలని, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పాఠశాల లేదా వసతి గృహం నుంచి వెళ్లిపోవడం వంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని హెచ్చరించారు.

కష్టపడి చదివితేనే ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించవచ్చని, ఆర్థికంగా ఎదగడంతో పాటు సమాజంలో గౌరవం, గుర్తింపు పొందవచ్చని తెలిపారు. ప్రతి విద్యార్థి తన విజయాలతో తల్లిదండ్రులు, పాఠశాల, స్వగ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సహాయ పోలీస్ కమిషనర్ ఎస్.వి. కిరణ్ కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top