చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిలో పోలీసులంటే భయం ఉండాలి…
శాంతిభద్రతల పరిరక్షణే తొలి ప్రాధాన్యం….
— పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: రామగుండం, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల్లో పోలీసులంటే భయం కలిగేలా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు.
కమిషనరేట్‌లోని వివిధ విభాగాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర నేర పరిశోధన విభాగం సహాయ పోలీస్ కమిషనర్లు కె. రవీందర్, టి. ప్రవీణ్ కుమార్, ప్రత్యేక కార్యాచరణ దళం సహాయ పోలీస్ కమిషనర్ బి. శ్రీనివాస్ పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నేరాల నియంత్రణ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ప్రజల్లో భద్రతాభావం పెంపొందించేలా, నేరాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

