చలో కొడంగల్’ విజయవంతం… తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనకు పోరాటం కొనసాగుతుంది

Sakshitha news

‘చలో కొడంగల్’ విజయవంతం… తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనకు పోరాటం కొనసాగుతుంది….

కేకే కమిటీ నివేదికను వెంటనే అమలు చేయాలని టీయూఎఫ్ డిమాండ్…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం చేపట్టిన “చలో కొడంగల్” కార్యక్రమం విజయవంతమైందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) నాయకులు తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉద్యమకారులు, మహిళలు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు, రాజకీయ నాయకులు, టీయూఎఫ్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ర్యాలీ అనంతరం కొడంగల్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 కార్లలో 500 మంది ఉద్యమకారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

డాక్టర్ చీమ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన అంశాలు అమలు చేయాలని కోరారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉద్యమకారులకు కల్పించిన తరహాలో తెలంగాణలో కూడా ప్రత్యేక సంక్షేమ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా టీయూఎఫ్ నాయకులు పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణ సహాయం, నెలవారీ పెన్షన్, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు, తెలంగాణ కళాకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఉచిత బస్సు, రైల్వే పాస్‌లు, ఆరోగ్య కార్డులు, సంక్షేమ పథకాలలో 20 శాతం కోటా, పరిశ్రమల్లో స్థానికులకు 90 శాతం ఉద్యోగాలు, ఉద్యమకారుల విద్యార్థులకు నైపుణ్య ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఉద్యమకారులను అధికారికంగా సన్మానించాలని, అమరవీరుల కుటుంబాలన్నింటినీ ప్రభుత్వం ఆదుకోవాలని, రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు.

కేకే కమిటీ నివేదికను ఆలస్యం చేయకుండా వెంటనే ప్రభుత్వానికి సమర్పించి, అందులోని సిఫారసులను అమలు చేయాలని టీయూఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందరాము ప్రశాంత్, వైస్ చైర్మన్ శంకర్ నాయక్, టీయూఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గుండేటి ఐలయ్య యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతి, నూనె రాజేశం, బత్తుల శంకర్, ఎ. శ్రీనివాస్ రెడ్డి, జి. రాజిరెడ్డి, కొడంగల్ ప్రాంత టీయూఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top