ఆస్పత్రి కాంట్రాక్టు కార్మికులకు రూ.26 వేల వేతనం అమలు చేయడంలో ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా..?
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ సూటి ప్రశ్న….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పేషంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ గార్డులు మరియు వివిధ విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల సమావేశం ఆసుపత్రి ఆవరణలో వైనాల రవి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ హాజరై మాట్లాడుతూ, అత్యవసర సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నెలకు రూ.26 వేల వేతనాన్ని ఇప్పటికీ అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు.
ఆసుపత్రిలో రోజురోజుకూ పని భారం పెరుగుతున్నప్పటికీ, కార్మికులకు వారి శ్రమకు తగిన ఫలితం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం నిరంతరం కష్టపడుతున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వెంటనే రూ.26 వేల వేతనం అమలు చేయాలని, కాంట్రాక్టర్లు కూడా ఆ మేరకు టెండర్లు వేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కార్మికులు ఐక్యంగా పోరాటాలు, ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
కనీస వేతనాల సాధన కోసం కాంట్రాక్ట్ కార్మికులంతా సంఘటితంగా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కడారి సునీల్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఐలఅక్క, రాజేశ్వరి, నర్మదా, బాల్రాజ్, వైనాల రవి, మల్లమ్మ, రాజేష్, మౌనిక, సరిత, హనుమంతు, ఎల్లమ్మ, సుశీల, రమ్య, సునీత, వంశీ, నరేష్, లక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
