ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించాలి….

Sakshitha news

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించాలి….

–డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 1, 2, 3, 4, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 డివిజన్లకు సంబంధించిన క్లస్టర్ స్థాయి వార్డు సభను సోమవారం ఎన్‌టీపీసీ పీటీఎస్‌లోని కాకతీయ కల్యాణ మండపంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన రామగుండం నగర డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య మాట్లాడుతూ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ఆర్‌పీలు సమన్వయంతో పనిచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా చూడాలని సూచించారు.
ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని సక్రమంగా అమలు చేయాలని అన్నారు. స్వచ్ఛ రామగుండం లక్ష్యంగా ఎమ్మెల్యే, మేయర్‌తో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు వార్డు బాట పట్టి గత రెండు నెలలుగా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచే స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ వినియోగం వల్ల పిల్లలు వ్యసనాలకు గురై దారి తప్పుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని సూచించారు.

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం మున్సిపల్ కమిషనర్ జె. అరుణశ్రీ మాట్లాడుతూ రుతుపవనాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. కాలువల్లో పూడిక తొలగించి నీటి పారుదల సాఫీగా జరిగేలా చర్యలు తీసుకున్నామని, రోడ్లపై గుంతలు పూడ్చడం, శిథిలావస్థలో ఉన్న భవనాల తొలగింపు, పైప్‌లైన్ లీకేజీల మరమ్మత్తులు చేపడుతున్నామని వివరించారు.

అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. దోమలు పెరగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా చెత్తను తడి, పొడి, సానిటరీ, ఎలక్ట్రానిక్ వ్యర్థాలుగా వేర్వేరుగా విభజించి ఇవ్వాలని సూచించారు.

ఓటరు జాబితా మాపింగ్ ప్రక్రియను జూన్ 15లోగా పూర్తి చేయాలని తెలిపారు. వర్షాల ప్రభావం తగ్గించేందుకు నీటి సంరక్షణ చర్యలు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. వన మహోత్సవం సందర్భంగా మొక్కల నాటడానికి అనువైన స్థలాలను గుర్తిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ ముడుత రమేష్ ట్రాఫిక్ నిబంధనలు, “అరైవ్ అలైవ్” కార్యక్రమంపై అవగాహన కల్పించారు. డీసీపీ రాంరెడ్డి మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను వివరించారు. ఎంఆర్వో రవీందర్ ఓటరు జాబితా సవరణపై అవగాహన కల్పించగా, వైద్య ఆరోగ్య శాఖ అధికారి అతుల్య అంటువ్యాధుల నివారణపై సూచనలు చేశారు. ఐసీడీఎస్ సీడీపీవో ఆలేఖ్య పటేల్ అంగన్‌వాడీ కార్యకలాపాలపై వివరించారు.

ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, అసిస్టెంట్ కమిషనర్ సంపత్, ఏసీపీ శ్రీహరి, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top