ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్…
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాఠశాలల్లో సరైన బాత్రూమ్ సదుపాయాలు లేక విద్యార్థులు చెట్ల పక్కన, గోడల వద్దకు వెళ్లే పరిస్థితి నెలకొందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని విమర్శించారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తక్షణమే అమలు చేసి, నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు.
విద్యాశాఖ అధికారులు సమస్యలపై స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.
