సామాజిక రుగ్మతల నిర్మూలనకు బోనకల్‌లో కొత్త అధ్యాయం
జెండర్ వనరుల కేంద్రం ఘన ప్రారంభం
గృహ హింస, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలి
తాసిల్దార్ సిహెచ్ సుధాకర్
రాథోడ్, బోనకల్,
సమాజంలో మహిళల సాధికారత, సామాజిక భద్రత, కుటుంబ సంక్షేమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో బోనకల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జెండర్ వనరుల కేంద్రాన్ని బోనకల్ తాసిల్దార్ సిహెచ్ సుధాకర్, ఎంపీడీవో రమాదేవి, బోనకల్ గ్రామ సర్పంచ్ బానోతు జ్యోతి కొండ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేంద్రం ద్వారా అమలు చేయనున్న సామాజిక కార్యక్రమాలను ఆవిష్కరించారు. సమాజంలో ఇంకా కొనసాగుతున్న అనేక సామాజిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వేదికగా ఈ కేంద్రం పనిచేయనుందని వారు పేర్కొన్నారు.
గృహ హింస రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి కుటుంబంలో పరస్పర గౌరవం, అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టి ఆడపిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మండలంలో ఏ చిన్నారి కూడా పనిలోకి వెళ్లకుండా అందరూ విద్యను అభ్యసించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మద్యపాన వ్యసనాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు, సలహా సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.
అదేవిధంగా మానవ అక్రమ రవాణా, జోగిని, బసివిని, మాతంగి వంటి దురాచారాలతో పాటు మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. సమాజాన్ని వెనక్కి నెట్టే ప్రతి సామాజిక రుగ్మతను పారద్రోలి బోనకల్ మండలాన్ని జిల్లాలోనే ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
