భావితరాల భవిష్యత్తు కోసం పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి….
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మొక్కల నాటకం, బైక్ ర్యాలీ
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం, అడవుల సంరక్షణ అత్యంత అవసరమని అదనపు జిల్లా న్యాయమూర్తి కె. స్వప్న రాణి అన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా రంగంపల్లి జిల్లా కోర్టు సముదాయంలో అదనపు జిల్లా న్యాయమూర్తి కె. స్వప్న రాణి, జూనియర్ సివిల్ జడ్జి ఎన్. మంజుల ఆధ్వర్యంలో మొక్కల నాటకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడవుల ప్రాధాన్యం, పర్యావరణ పరిరక్షణ అవసరంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అదనపు జిల్లా న్యాయమూర్తి కె. స్వప్న రాణి మాట్లాడుతూ, వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా సవాళ్లుగా మారుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు.
అనంతరం భూపాలపల్లి జిల్లా అటవీ అధికారి, పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జ్ అటవీ అధికారి ఎం. నవీన్ రెడ్డి, ఐఎఫ్‌ఎస్ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కల నాటకం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రామగుండం ప్రాంతీయ కార్యాలయ సహాయ శాస్త్రవేత్త ఈ. కనక జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐడీఓసీ కార్యాలయం నుంచి ఖిలావనపర్తి గ్రామం వరకు అటవీ శాఖ సిబ్బందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్మారం మండలంలోని ఖిలావనపర్తి రాంపల్లి రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లోని కాంపార్ట్‌మెంట్ నెం.479/1 వద్ద రెండు హెక్టార్ల అధిక సాంద్రత మిశ్రమ మొక్కల పెంపకం ప్రాంతంలో ప్రత్యేక మొక్కల నాటకం కార్యక్రమం చేపట్టారు.
కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కోర్టు సముదాయంలో 30 మొక్కలు, ఐడీఓసీ కార్యాలయ ప్రాంగణంలో 10 మొక్కలు, ఖిలావనపర్తి ప్రాంతంలో 20 మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమాల్లో అటవీ శాఖ అధికారులు టి. సతీష్ కుమార్, వినయ్ నాయక్, దేవదాస్, రమేష్ కొమురయ్య, రహమతుల్లా, ఖిలావనపర్తి సర్పంచ్ మోతే కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
