సౌర విద్యుత్ కేంద్ర కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి….
ఫిర్యాదుల పరిష్కార కమిటీ ఛైర్మన్‌కు వినతిపత్రం అందజేసిన ఏఐటియుసి కార్మిక సంఘం నాయకులు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం,రామగుండం ప్రాంత ఫ్యాక్టరీ ఒప్పంద కార్మికుల ఏఇటియుసి సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు రెడ్డపాక లక్ష్మణ్, కార్యదర్శి నాంసాని శంకర్ నేతృత్వంలో ఫిర్యాదుల పరిష్కార కమిటీ ఛైర్మన్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు.
రామగుండం సౌర విద్యుత్ కేంద్రంలోని పది మెగావాట్ల ప్రాజెక్టులో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు ప్రతి నెల ఏడవ తేదీలోపు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వేతనాల చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వేతనాల చట్టం–2019 ప్రకారం నిర్ణీత గడువులోపు కార్మికులకు వేతనాలు అందజేయడం యాజమాన్యం బాధ్యత అని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతుండటంతో కుటుంబ పోషణ, పిల్లల విద్య, వైద్య ఖర్చుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. కార్మికుల శ్రమకు తగిన గౌరవం ఇవ్వాలంటే సకాలంలో వేతనాలు చెల్లించడం అత్యంత అవసరమని తెలిపారు.
సంబంధిత కాంట్రాక్టు సంస్థకు వెంటనే ఆదేశాలు జారీ చేసి ప్రతి నెలా నిర్ణీత తేదీలోపు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుల పరిష్కార కమిటీ ఛైర్మన్‌ను కోరారు. కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కార్మికుల సంక్షేమం, భద్రత, ఉద్యోగ భరోసా అంశాలపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని సంఘం నాయకులు కోరారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ఉద్యమ కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టి. సత్యనారాయణ, బి. అర్జున్, శివపాల్ సింగ్, సాంబయ్యతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
