జనాభా గణన-2027 విజయవంతానికి ప్రతి కుటుంబం సహకరించాలి

Sakshitha news

జనాభా గణన-2027 విజయవంతానికి ప్రతి కుటుంబం సహకరించాలి – హౌస్ లిస్టింగ్ సర్వేలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:,
జనాభా గణన-2027లో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సర్వేకు ప్రజలు పూర్తి సహకారం అందించి, ఎన్యూమరేటర్లకు వాస్తవ సమాచారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు.
తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన హౌస్ లిస్టింగ్ సర్వేలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఎన్యూమరేటర్‌కు అవసరమైన వివరాలను అందజేశారు. అనంతరం సర్వే ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనాభా గణన-2027లో హౌస్ లిస్టింగ్ సర్వే అత్యంత కీలక దశ అని తెలిపారు. ప్రతి ఇంటి నిర్మాణం, గృహ సౌకర్యాలు, తాగునీటి వసతి, పారిశుద్ధ్య సదుపాయాలు, విద్యుత్, వంట ఇంధనం, సమాచార ప్రసార సౌకర్యాలు తదితర వివరాలను ఈ సర్వే ద్వారా నమోదు చేస్తారని చెప్పారు.

సర్వే ద్వారా సేకరించే సమాచారం ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో సహకరించి సరైన వివరాలను అందించాలని సూచించారు.

సర్వేలో అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, ఈ సమాచారంతో ఏ సంక్షేమ పథకం రద్దు కావడం గానీ, లబ్ధిదారుల అర్హతలు ప్రభావితమవడం గానీ జరగదని స్పష్టం చేశారు. ప్రజలు ఎటువంటి అపోహలకు తావివ్వకుండా సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు.

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, పర్యవేక్షకులు నిబంధనల ప్రకారం ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను నమోదు చేయాలని, సర్వేను పారదర్శకంగా, నాణ్యతతో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top