కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక…

Sakshitha news

కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక…

నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని పిలుపు…

ప్రతి కార్యకర్తకు అన్ని వేళలా అండగా ఉంటాను…

–ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: ఎన్‌టీపీసీ,
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. ఎన్‌టీపీసీలోని మిలీనియం హాల్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త తన కుటుంబ సభ్యుడితో సమానమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ఎన్నికల సమయంలోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ అంకితభావంతో పనిచేసే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని కొనియాడారు.
తన రాజకీయ ప్రయాణంలో, ఎన్నికల విజయాల్లో కార్యకర్తల కృషి, నిబద్ధత ఎంతో ఉందని గుర్తుచేసుకుంటూ, వారి సేవలను ఎప్పటికీ మరువనని తెలిపారు. పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

కార్యకర్తల సంక్షేమం, గౌరవం తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని మరింతగా గెలుచుకునేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
రామగుండం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసి, వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ రామగుండం ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తాను కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, బొంతల రాజేష్, కాల్వ లింగస్వామి, ఎండీ ముస్తఫా, అసిఫ్ పాషా, పెండ్యాల మహేష్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top