పొగ లేని పొలం – రోగం లేని గ్రామం”రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం….
రాయితీపై పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ – పంట అవశేషాలు కాల్చొద్దని రైతులకు సూచన….
–ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పాలకుర్తి,
రైతుల ఆర్థికాభివృద్ధి, భూముల సారవంతత పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. పాలకుర్తి మండలంలో బుధవారం నిర్వహించిన రైతులకు రాయితీపై పచ్చి రొట్టె విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులకు విత్తన సంచులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వ్యవసాయం లాభసాటిగా మారేందుకు ప్రభుత్వం రైతులకు అవసరమైన అన్ని విధాలుగా అండగా నిలుస్తోందన్నారు. “పొగ లేని పొలం – రోగం లేని గ్రామం” అనే నినాదంతో రైతులు పంట అవశేషాలు, గడ్డి, కొయ్యలను కాల్చకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పంట అవశేషాల దహనం వల్ల గాలి కాలుష్యం పెరగడంతో పాటు నేలలోని సూక్ష్మ పోషకాలు నశించి భూమి సారం తగ్గే ప్రమాదం ఉందని వివరించారు.
ప్రతి ఏడాది వానాకాలం సీజన్‌కు ముందు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం రాయితీపై పచ్చి రొట్టె, జీలుగ, జనుము విత్తనాలను రైతులకు అందజేస్తోందని తెలిపారు. ఈ విత్తనాల సాగు ద్వారా నేల సారవంతత పెరిగి అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అభ్యున్నతి కోసం రుణమాఫీ, వ్యవసాయ యంత్రాలపై రాయితీలు, నాణ్యమైన విత్తనాల పంపిణీ, సాగునీటి సదుపాయాల మెరుగుదల వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
అనంతరం పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని రైతులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, కన్నాల సింగిల్ విండో చైర్మన్, వ్యవసాయ శాఖ అధికారులు, ఎంపీడీవో, ఎస్హెచ్ఓ, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
