పంట అవశేషాల దహనం మానండి.. భూసారం, పర్యావరణాన్ని కాపాడండి…
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు…
–జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
పంట కోతల అనంతరం మిగిలిపోయే పంట అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణానికి, భూసారానికి, రైతుల ఆర్థిక పరిస్థితికి తీవ్ర నష్టం కలుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ హెచ్చరించారు. రైతులు పంట అవశేషాలను దహనం చేయకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని ఆయన సూచించారు.
విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో వరి కోతల అనంతరం పంట అవశేషాలను కాల్చుతున్న ఘటనలు అధికంగా గమనిస్తున్నామని తెలిపారు. ఈ దహనం వల్ల హానికర వాయువులు వాతావరణంలోకి విడుదలై గాలి కాలుష్యం పెరిగి ప్రజల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు.
పంట అవశేషాల దహనం కారణంగా నేలలోని సేంద్రియ పదార్థాలు, నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ముఖ్య పోషకాలు నశించి భూసారం తగ్గిపోతుందని పేర్కొన్నారు. దీంతో రైతులు అధికంగా రసాయన ఎరువులు వినియోగించాల్సి వచ్చి సాగు ఖర్చులు పెరగడంతో పాటు దిగుబడులు కూడా తగ్గే అవకాశం ఉందని వివరించారు.
అలాగే పంట అవశేషాలను కాల్చడం వల్ల మంటలు అదుపు తప్పి సమీపంలోని పంటలు, ఆస్తులు, విద్యుత్ తీగలు దెబ్బతినే ప్రమాదం ఉందని, పశువుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు.
రైతులు పంట అవశేషాలను నేలలో కలియదున్నడం, సేంద్రియ ఎరువుల తయారీలో వినియోగించడం, పశుగ్రాసంగా ఉపయోగించడం, నేల తేమను కాపాడే విధానాలను అవలంబించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను పాటించాలని సూచించారు.
జిల్లాలో పంట అవశేషాల దహనాన్ని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపడుతున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
రైతులు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడి, భూసారాన్ని కాపాడే స్థిరమైన వ్యవసాయ విధానాలను అనుసరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

