భవిష్యత్తులో సంభవించే ఎలాంటి విపత్తులనైన సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధం – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వరద ముప్పు ముంచెత్తితే.. క్షణాల్లో రక్షించే చర్యలపై ‘నల్ల చెరువు’లో వనపర్తి జిల్లా యంత్రాంగం లైవ్ డెమో
సాక్షిత వనపర్తి :
విపత్తుల సమయంలో అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ఆదేశాలు, రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) సూచనల మేరకు వనపర్తి పట్టణంలోని నల్ల చెరువులో సోమవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. భారీ వరదలు సంభవించిన సందర్భంలో ప్రజలను ఎలా రక్షించాలి, అత్యవసర పరిస్థితుల్లో స్పందనా బృందాలు ఎలా పనిచేయాలనే అంశాలపై ఈ మాక్‌డ్రిల్ చేపట్టారు.
మాక్‌డ్రిల్‌లో భాగంగా వరదల కారణంగా నల్ల చెరువులో ముంపునకు గురై చిక్కుకున్న ప్రజలను ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక, పోలీస్ శాఖలు సురక్షితంగా రక్షించే చర్యలను ప్రదర్శించారు. స్పందనా బృందాలు సమన్వయంతో పనిచేస్తూ బోటు, లైఫ్ జాకెట్ల సాయంతో ప్రజలను రక్షించి, ప్రథమ చికిత్స అందజేసి అంబులెన్సులో సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు.
ఈ మాక్‌డ్రిల్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి పరిశీలించి, సహాయక చర్యల నిర్వహణ తీరును పర్యవేక్షించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విపత్తులు వచ్చి అత్యవసర పరిస్థితులు ఏర్పడిన సమయంలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రజల్ని ఎలా కాపాడాలని అంశంపై మార్క్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ శాఖలు సంసిద్ధత కోసం ఈ మాక్ డ్రిల్ అనేది ఎంతో ముఖ్యమైన ప్రక్రియ అని తెలిపారు. వరదలు వచ్చి అత్యవసర పరిస్థితులు ఏర్పడే ఏడు ప్రదేశాలను జిల్లాలో గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. 10 సెంటీమీటర్స్ పైన వర్షపాతం నమోదు అయితే నల్ల చెరువు ప్రాంతంలో వరద నీటితో అత్యవసర పరిస్థితి ఏర్పడే నేపథ్యంలో ఇక్కడ మోక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ వైద్య ఆరోగ్యశాఖ, నీటిపారుదల శాఖ, ఇతర ముఖ్యమైన శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలను కాపాడే చర్యలను సంసిద్ధతను ప్రదర్శించడం జరిగిందని తెలిపారు.
కార్యక్రమం లో వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, డిఎస్పి గిరి ప్రసాద్, ఇతర జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
