నీట్ పేపర్ లీక్‌పై యువజన కాంగ్రెస్ ఆందోళన
సాక్షిత నల్గొండ : కేతపల్లి మండలంలో నీట్ యూజీ 2026 పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మున్నా అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా ఖండించారు. వరుసగా జరుగుతున్న పేపర్ లీక్‌లు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏనుగు రఘుమా రెడ్డి మాట్లాడుతూ, “గత పది సంవత్సరాల్లో అనేక సార్లు పేపర్ లీక్‌లు జరగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
విద్యార్థుల కష్టం, తల్లిదండ్రుల ఆశలను బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోంది. విద్యార్థులకు భద్రత కల్పించలేని ప్రభుత్వం అధికారంలో కొనసాగడానికి అర్హత కోల్పోయింది” అని మండిపడ్డారు. అదేవిధంగా, ఎన్ టి ఏ. స్వయంగా పేపర్ లీక్ జరిగినట్లు అంగీకరించి పరీక్షను రద్దు చేయడం దేశ విద్యా వ్యవస్థకు మచ్చగా నిలిచిందని పేర్కొన్నారు. పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.“విద్యార్థుల భవిష్యత్తు రక్షణ కోసం యువజన కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది” అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

