పెద్దపల్లి మండలం రంగాపూర్ లోని ఐజి గోదాములను పరిశీలన
ధాన్యం లిఫ్టింగ్‌లో జాప్యానికి తావులేకుండా చర్యలు…
అదనపు లారీలు, డీసీఎంలతో వేగవంతం చేయాలి…
— జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:మంథని,
జిల్లాలో ధాన్యం కొనుగోలు, లిఫ్టింగ్ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెండింగ్‌లో ఉండకుండా వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
పెద్దపల్లి మండలం రంగాపూర్‌లోని ఐజి గోదాములు, మంథని మండలం పుట్టపాక గ్రామంలోని ఐకెపి కొనుగోలు కేంద్రం, మంథని మార్కెట్ యార్డును కలెక్టర్ పరిశీలించి ధాన్యం కొనుగోళ్లు, నిల్వలు, లిఫ్టింగ్ పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా మంథని మార్కెట్ యార్డులో మాట్లాడిన కలెక్టర్, నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసి ఎక్కువకాలం కేంద్రాల వద్ద నిల్వ ఉంచకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం రోజుకు సుమారు 70 లారీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అదనంగా మరో 30 నుంచి 40 లారీలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆర్టీఓ శాఖ, రవాణా ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు.
డీసీఎం వాహనాలను కూడా ధాన్యం రవాణాకు వినియోగించాలని, అవసరమైతే కొద్ది రోజుల పాటు ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను సైతం ధాన్యం తరలింపునకు మళ్లించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు సమీపంలో ఉన్న రైస్ మిల్లులకు ట్రాక్టర్ల ద్వారా కూడా ధాన్యం తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు, రవాణా, లిఫ్టింగ్ ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం మంథని మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు దొంతులవాడలో జరుగుతున్న జనాభా లెక్కల కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.
తరువాత మంథని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, సయేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

