తడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులకు నష్టం లేకుండా చర్యలు…
–మంత్రి శ్రీధర్ బాబు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:మంథని, అకాల వర్షాల నేపథ్యంలో రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంథని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన మంత్రి, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. తడిసిన ధాన్యాన్ని తిరస్కరించకుండా కొనుగోలు చేయాలని ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రవాణా సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లారీలు, హమాలీల కొరత లేకుండా చూడాలని, ప్రతి కేంద్రంలో గన్నీ బ్యాగులు, టార్పాలిన్‌లు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతు సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో ఆర్డిఓ సురేష్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY