వివక్ష పోవాలంటే ఆలోచనల్లో మార్పు రావాలి
** జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలో టీటీడీ సివిఎస్వో
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: మానవ సమాజంలో తరతమ భేదాలు లేకుండా అందరిలో సమానత్వం ఉంటేనే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యమవుతుందని టీటీడీ సివిఎస్వో కె.వి. మురళీకృష్ణ తెలిపారు. గొప్ప మానవతావాది డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు కట్టమంచి ఇందిర నేతృత్వంలో…. సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనంద రాజు ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీఎస్వో మాట్లాడుతూ, సమాజంలో వివక్ష తొలగాలంటే ప్రతి ఒక్కరి ఆలోచనలో మార్పు రావాలన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా పనిచేసిన డా. జగ్జీవన్ రామ్ దేశంలో హరిత విప్లవానికి తోడ్పడి వ్యవసాయ రంగానికి విశేష సేవలు అందించారని చెప్పారు.
చిన్ననాటి నుంచే ధార్మిక విలువలు అలవరచుకుని, అంటరానితన నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుందని, అది కులం లేదా ఆర్థిక స్థితిపై ఆధారపడదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న అదనపు జిల్లా న్యాయమూర్తి టి. రామచంద్రుడు మాట్లాడుతూ, బీహార్ భూకంప సమయంలో యువతను సమీకరించి సహాయక చర్యలు చేపట్టడం ఆయన నాయకత్వానికి నిదర్శనమన్నారు.
విజయవాడకు చెందిన చందు మాట్లాడుతూ, దళితుల హక్కుల కోసం డా. జగ్జీవన్ రామ్ చేసిన కృషి విశేషమన్నారు. మహిళల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. నెల్లూరుకు చెందిన చారులత మాట్లాడుతూ, జగ్జీవన్ రామ్ 52 ఏళ్ల రాజకీయ జీవితంలో అందరికీ సమానంగా సేవలందించిన నాయకుడు అని తెలిపారు.
ఈ సందర్భంగా డా. బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, విశేష సేవలందించిన 56 మంది ఉద్యోగులను సత్కరించారు. వ్యాసరచన, క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనంద రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ మహిళా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు కట్టమంచి ఇందిర, జాటోత్ భాస్కర్, కాటా గుణశేఖర్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

