అమరవీరుల త్యాగం.. అజరామరం
నేడు భగత్ సింగ్, రాజగురు, సుఖ్‌దేవ్ 95వ వర్ధంతి
బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన విప్లవ కిశోరాలు సమతా సైనిక దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. మార్షల్ దుర్గం నగేష్
ఎన్టిపిసి, మార్చి 23: భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరులు భగత్ సింగ్, రాజగురు, సుఖ్‌దేవ్‌ల త్యాగాలు చిరస్మరణీయమని సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ కొనియాడారు.
సోమవారం భగత్ సింగ్, రాజగురు, సుఖ్‌దేవ్‌ల 95వ వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నగేష్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి బానిస చెర నుంచి మాతృభూమిని విముక్తి చేసేందుకు ఈ ముగ్గురు వీరులు సాగించిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.
1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైలులో ఉరిశిక్ష పడిన సమయంలో ఆ ముగ్గురు వీరులు ప్రదర్శించిన ధైర్యం అమోఘమని నగేష్ గుర్తుచేశారు. ఉరిశిక్షకు ముందు భగత్ సింగ్ మార్క్సిస్ట్ పుస్తకాన్ని పఠిస్తుండగా, సుఖ్‌దేవ్ పాటలు పాడుతూ, రాజగురు వేద మంత్రాలను జపిస్తూ మృత్యువును చిరునవ్వుతో ఆహ్వానించారని వివరించారు.
‘మాకు పిచ్చి వదిలేయండి.. మేము దేశం కోసం త్యాగం చేసే పిచ్చివాళ్లం’ అంటూ సుఖ్‌దేవ్ జైలు వార్డెన్‌కు ఇచ్చిన సమాధానం వారి విప్లవ భావజాలానికి నిదర్శనమని పేర్కొన్నారు.
భగత్ సింగ్ చిన్నతనంలోనే పొలంలో తుపాకులను విత్తుతూ, బ్రిటిష్ వారిని తరిమికొడతానని చెప్పడం అతని దేశభక్తికి పరాకాష్ట అని నగేష్ అన్నారు.
నౌజవాన్ భారత్ సభ, హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ ద్వారా వారు సాగించిన సాయుధ పోరాటం సామ్రాజ్యవాద పునాదులను కదిలించిందన్నారు.
సాండర్స్ హత్య ద్వారా లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారని, సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు విసిరి బ్రిటిష్ పాలకుల నిద్రమత్తును వదిలించారని గుర్తుచేశారు.
నేడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ అమరవీరుల ఆశయాలే దిక్సూచి అని నగేష్ అభిప్రాయపడ్డారు. వారి వర్ధంతిని ‘షహీద్ దివస్’ గా జరుపుకుంటూ, వారు కలలుగన్న సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు దుర్గం ప్రమీల నగేష్ ,సమతా సైనిక దళ్ నాయకులు చీమల ఆనంద్, జిమ్మిడి అశోక్, జిమ్మిడి శాంతి కుమార్, రామ టెంకి విశ్వనాథ్, గూడూరి లవన్ కుమార్, గన్న మహేష్ తదితరులు పాల్గొన్నారు.

