చిలకలూరిపేటలో రోడ్డు ఆక్రమణల పర్వం
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు!
చిలకలూరిపేట: పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చేపట్టిన చర్యలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. నరసరావుపేట సెంటర్ నుండి రిజిస్టర్ ఆఫీస్ వరకు ప్రధాన రహదారిపై ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు నామమాత్రంగా మార్కింగ్ వేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మార్కింగ్ బోర్డుల ధ్వంసం.. అడిగే వారే లేరా?
రోడ్డు విస్తరణలో భాగంగా మరియు ఆక్రమణలను గుర్తించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను కొందరు విరగ్గొడుతున్నారు. రిజిస్టర్ ఆఫీస్ వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను సైతం పక్కకు తొలగించి, తమ వ్యాపారాలకు అడ్డుగా ఉన్నాయనే సాకుతో ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ విభాగం కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
మార్కింగ్ మార్చేస్తున్న ‘ప్రైవేట్’ తెలివితేటలు
కొన్ని దుకాణాల ముందు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. టౌన్ ప్లానింగ్ అధికారులు వేసిన అసలు మార్కింగ్‌ను కొందరు రాత్రికి రాత్రే తుడిచివేసి, తమకు అనుకూలంగా రోడ్డు వైపునకు జరిపి కొత్త మార్కింగ్ వేసుకుంటున్నారు.తనిఖీల సమయంలో తప్పించుకుని, ఆ తర్వాత యథావిధిగా ఆక్రమణలు కొనసాగించడం.
తూతూ మంత్రంగా తనిఖీలు.. ప్రజల ఆగ్రహం
టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయకుండా, కేవలం కార్యాలయాలకే పరిమితమవుతున్నారని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు వచ్చి వెళ్ళిన కొద్దిసేపటికే మళ్ళీ ఆక్రమణలు మొదలవుతుండటంతో, వారి తనిఖీలు కేవలం ‘తూతూ మంత్రం’లా సాగుతున్నాయని విమర్శిస్తున్నారు
“నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించి, భారీగా చలానా విధిస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా చర్యలు తీసుకోవాలి.” స్థానిక ప్రజల విన్నపం.
చలానాల విధింపే మార్గం
కేవలం మార్కింగ్ ఇచ్చి వదిలేయకుండా, ప్రభుత్వ ఆస్తులను (బోర్డులను) ధ్వంసం చేసిన వారిపై మరియు మార్కింగ్‌ను మార్చిన వారిపై భారీ జరిమానాలు విధిస్తేనే రహదారులు ఆక్రమణల నుండి విముక్తి పొందుతాయని, అప్పుడే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY