జిల్లాలో విజయవంతంగా ముగిసిన 12వ విడత ఆపరేషన్ స్మైల్
176 మంది బాలల గుర్తింపు , 79 కేసులు నమోదు
బాలల వెట్టిచాకిరిపై కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ నరసింహ
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : జిల్లాలో బాలల రక్షణ, సంరక్షణ లక్ష్యంగా నిర్వహించిన 12వ విడత ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లావ్యాప్తంగా వెట్టిచాకిరి, నిరాదరణకు గురైన, తప్పిపోయిన 176 మంది బాలబాలికలను గుర్తించి సంరక్షణ కల్పించామని అన్నారు. ఈ సందర్భంగా 79 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. జనవరి నెల మొత్తం పాటు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా యంత్రాంగం, బాలల సంక్షేమం, లేబర్, రెవెన్యూ, హెల్త్ తదితర శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ ను పగడ్బందీగా నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమం పూర్తైన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, ఉత్తమంగా పని చేసిన సిబ్బందిని అభినందించారు.
ఈ ఆపరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి చెందిన 56 మంది బాలలు (49 బాలురు, 7 బాలికలు), ఇతర రాష్ట్రాలకు చెందిన 120 మంది బాలలు (80 బాలురు, 40 బాలికలు) గుర్తించి, వారిని వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు సురక్షితంగా అప్పగించినట్లు తెలిపారు. అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక రెస్క్యూ టీములు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ఈ పిల్లలను రక్షించాయని చెప్పారు. బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఆపరేషన్ స్మైల్ చేపట్టామని, బాలల రక్షణ కోసం నిరంతర పోలీస్ తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు. బాలలను వెట్టిచాకిరికి గురిచేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బాలల వికాసానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి మంచి భవిష్యత్తు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు ఉచిత విద్య, వసతి సదుపాయాలు కల్పిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశేషంగా కృషి చేసిన పోలీసు సిబ్బంది, జిల్లా బాల రక్షణ అధికారులు, వివిధ శాఖల అధికారులను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిసిఆర్బి డిఎస్పీ రవి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, పోలీస్ ఐటి ఏఆర్ఎస్ఐ రాజశేఖర్, చైల్డ్ సంరక్షణ అధికారులు రవి, నాగుల్ మీరా, స్మైల్ బృందం ఎస్ఐ మల్లేశం, ఏఎస్ఐ వెంకన్న, స్మైల్ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY