భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ సూచించారు.
భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితులు మినహా అనవసరంగా బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు.
ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణ భద్రతే ముఖ్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ వర్షాల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
