వరద బారి నుండి ప్రజలను సురక్షితంగా కాపాడిన మున్సిపల్ కమిషనర్

Sakshitha news

వరద బారి నుండి ప్రజలను సురక్షితంగా కాపాడిన మున్సిపల్ కమిషనర్

అశ్వారావుపేట సాక్షిత :
అశ్వారావుపేట లో మురసు తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కుంభ వృష్టిగా కురిసిన వర్షానికి అశ్వారావుపేట పట్టణం జలమయంగా మారింది. ఊహకు కూడా అందనటువంటి వరద రావటంతో పట్టణంలో చాలా ప్రాంతాలలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. దొంతికుంట చెరువు ప్రమాదకరస్థాయిలో పొంగి రోడ్డు పై నుండి వరద నీరు పారటంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. స్పందించిన మున్సిపాలిటీ కమిషనర్ దిలీప్ రెడ్డి సిబ్బందిని ఉరుకులు పెట్టిస్తూ తాను కూడా వర్షంలో తడుస్తూ ద్విచక్ర వాహనంపై ప్రతి వార్డు కలయ తిరుగుతూ రక్షణ చర్యలను చేపట్టారు.

దొంతికుంట చెరువును ఐబి డిఇ తో మాట్లాడి గండి కొట్టించి సమీప ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన తడుస్తూ సిబ్బందిని ఉరుకులు పెట్టిస్తూ పని చేయించడంతో వరద బారి నుండి ప్రజలు సురక్షితంగా బయటపడ్డారు. కమిషనర్ చూపిన చొరవకు ప్రతి ఒక్కరు ప్రశంసించారు. సమయ అనుకూలంగా ఆయన నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని ఏది ఏమైనా మున్సిపాలిటీకి ఓ మంచి అధికారి దొరకటం ఎంతో ఆనందంగా ఉందంటూ గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.