ప్రజా సేవే లక్ష్యంగా రేణు కేర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు

Sakshitha news

ప్రజా సేవే లక్ష్యంగా రేణు కేర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు

రూ.17 వేలతో రత్నవరం పశువైద్యశాలలో మౌలిక వసతుల కల్పన

సాక్షిత సూర్యాపేట జిల్లా/ నడిగూడెం :
ప్రజా సేవే లక్ష్యంగా రేణు కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, నడిగూడెం మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షులు మిరియాల శ్రీను తెలిపారు. ఇందులో భాగంగా రత్నవరం గ్రామంలోని పశువైద్యశాలలో సుమారు రూ.17 వేల వ్యయంతో పలు మౌలిక వసతులను ఏర్పాటు చేశారు.

పశువైద్యశాలలో నీటి సౌకర్యం కోసం కొత్త టెక్స్మో మోటార్‌ను ఏర్పాటు చేసి, వాటర్ ట్యాంక్ నిర్మించి పెయింటింగ్ వేయించారు. అలాగే పైపులైన్లు ఏర్పాటు చేసి వైద్యశాల బాత్రూంలోకి నీరు వచ్చేలా, పశువులకు తాగునీరు అందేలా చర్యలు చేపట్టారు.
అదేవిధంగా వైద్యశాల చుట్టూ గ్రీన్ మ్యాట్‌ను ఏర్పాటు చేసి పరిసరాలకు రక్షణ కల్పించారు. వైద్యశాల చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు.
ఈ సందర్భంగా మిరియాల శ్రీను మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో తనవంతు భాగస్వామ్యం అందించడంతో పాటు ప్రజలకు, పశువులకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టడమే తమ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమన్నారు. వైద్యశాలకు వచ్చే వారు చేతులు శుభ్రం చేసుకునేందుకు నీటి సౌకర్యం, పశువుల దాహం తీర్చేందుకు తాగునీటి వసతి కల్పించామని తెలిపారు.
అదేవిధంగా గ్రామానికి వచ్చే నిరుపేదలు, బిక్షాటన చేసేవారు, సంచార జీవనం సాగించే వారు తదితరులకు అవసరమైన సమయంలో ఆశ్రయం కల్పించేందుకు ఈ ప్రదేశం ఉపయోగపడాలనే ఉద్దేశంతో పరిసరాలను శుభ్రం చేసి సౌకర్యాలను మెరుగుపరిచినట్లు తెలిపారు.ప్రజా అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులోనూ రేణు కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని మిరియాల శ్రీను పేర్కొన్నారు