నాణ్యమైన విద్యుత్ అందించాలి..

Sakshitha news

నాణ్యమైన విద్యుత్ అందించాలి..

టీడీపీ నాయకులు, రైతుల నిరసన

సాక్షిత సూర్యాపేట జిల్లా/కోదాడ:
కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్‌లో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ సమస్యలను పరిష్కరించి రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కోదాడ పరిసర ప్రాంత గ్రామాల్లో విద్యుత్ సమస్యల కారణంగా మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ కాలిపోతున్నాయని ఆరోపించారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.


గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిందని, అయితే ప్రస్తుతం 12 గంటల విద్యుత్ కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని, సాగునీరు అందక పంటలు ఎండిపోతూ రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో విద్యుత్ సమస్యలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు కనీసం 12 గంటల పాటు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగానే రైతులు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని వారు కోరారు.