గిరిజన ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి….
ఎన్టీపీసీ రామగుండం, తెలంగాణ ప్రాజెక్టులను సందర్శించిన జాతీయ గిరిజన కమిషన్ సభ్యుడు….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి రామగుండం, : జాతీయ గిరిజన కమిషన్ సభ్యుడు జాతోత్తు హుస్సేన్ ఎన్టీపీసీ రామగుండం, తెలంగాణ విద్యుత్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్టీ ఉద్యోగులు, ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, ఎన్టీపీసీ యాజమాన్యంతో ఆయన ప్రత్యేకంగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
జాతీయ గిరిజన కమిషన్ డైరెక్టర్ డాక్టర్ పి. కల్యాణ్రెడ్డితో పాటు పలువురు అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. కమిషన్ ప్రతినిధులకు ఎన్టీపీసీ రామగుండం, తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రాజెక్టు అధిపతి చందన్ కుమార్ సమంతతో పాటు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎన్టీపీసీ యాజమాన్యం గిరిజన ఉద్యోగుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ చర్యలు, రిజర్వేషన్ విధానం అమలు, ఉద్యోగుల శిక్షణ–అభివృద్ధి కార్యక్రమాలు, ఫిర్యాదుల పరిష్కార విధానాలపై సమగ్రంగా వివరించింది. అలాగే గిరిజనులు, పరిసర ప్రాంతాల ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమాల ద్వారా చేపడుతున్న చర్యలను కమిషన్ ప్రతినిధులకు వివరించారు.
అనంతరం జాతీయ గిరిజన కమిషన్ సభ్యుడు జాతీయ గిరిజన ఉద్యోగులు, ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలు, సూచనలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంతో పాటు వారి సాధికారత, అభివృద్ధి కోసం సంక్షేమ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.అనంతరం కమిషన్ ప్రతినిధులు ఎన్టీపీసీ తెలంగాణ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు.
గిరిజన ఉద్యోగులకు సమాన అవకాశాలు కల్పించడం, అందరికీ సమానమైన పని వాతావరణాన్ని కల్పించడం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వారి సంక్షేమం, అభివృద్ధికి మరింత కృషి చేయడం తమ సంస్థ బాధ్యతగా భావిస్తోందని ఎన్టీపీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.
జాతీయ గిరిజన కమిషన్, ఎన్టీపీసీ యాజమాన్యం మధ్య జరిగిన ఈ సమావేశం గిరిజన ఉద్యోగులు, గిరిజన సమాజాల సంక్షేమం, అభివృద్ధి, సాధికారతకు సంబంధించిన అంశాలపై నిర్మాణాత్మక చర్చకు వేదికగా నిలిచింది.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
