ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు…

Sakshitha news

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు…

ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలి…

— కలెక్టర్‌ కోయ శ్రీహర్ష….

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/ : ప్రజావాణిలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ బి. శ్రీరాములుతో కలిసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన రాజవ్వ తన ఇద్దరు కుమారులు తనను పోషించడం లేదని, తన సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై జిల్లా సంక్షేమ అధికారికి సూచనలు చేస్తూ, సీనియర్‌ సిటిజన్స్‌ చట్టం ప్రకారం దరఖాస్తును ముందుకు పంపి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.

పెద్దపల్లికి చెందిన బి. రజిత తాను వృత్తివిద్యలో ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేశానని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎం పోస్టును ఔట్‌సోర్సింగ్‌ ద్వారా కల్పించాలని కోరారు. దీనిపై సంబంధిత సొసైటీకి లేఖ రాసి, అవకాశం మేరకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

కాల్వ శ్రీరాంపూర్‌ మండలం మీర్జాంపేటకు చెందిన పుల్లూరు పద్మ తనకు గతంలో అందుతున్న ఒంటరి మహిళల పింఛన్‌ నిలిచిపోయిందని, తిరిగి మంజూరు చేయాలని కోరారు. దీనిపై డీఆర్‌డీఓకు ఆదేశాలు జారీ చేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు.

మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన ఓ మహిళ జాతీయ రహదారి నిర్మాణంలో తనకు చెందిన 46 గుంటల భూమి పోతుండగా, రికార్డుల్లో 47 గుంటలుగా తప్పుగా నమోదైందని, దాన్ని సరిచేసి తన భూమిని రక్షించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసి, రికార్డులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని అధికారులు బాధ్యతతో పరిశీలించాలని, సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.