ఉద్యాన పంటలతో రైతు ఆదాయానికి కొత్త బాట..

Sakshitha news

ఉద్యాన పంటలతో రైతు ఆదాయానికి కొత్త బాట….

వరి సాగుకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటల వైపు అడుగులు వేయాలి…

ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి…

— జిల్లా ఉద్యానశాఖ అధికారి గడ్డం శ్యామ్‌ప్రసాద్…

సాక్షిత పెద్దపల్లి- పెద్దపల్లి/ : రైతులు సాంప్రదాయ పంటలైన వరి సాగుకే పరిమితం కాకుండా ఉద్యాన పంటలు, వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించి అధిక ఆదాయం పొందాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి గడ్డం శ్యామ్‌ప్రసాద్ సూచించారు. రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆయిల్‌పామ్‌, పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగుతో పాటు డ్రిప్‌, స్ప్రింక్లర్‌ వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులకు ఉద్యానశాఖ ద్వారా గణనీయమైన రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు.

పండ్ల తోటలకు రాయితీలు:

ఎంఐడీహెచ్‌ పథకం కింద మామిడి, దానిమ్మ, నిమ్మ వంటి పండ్ల తోటల సాగుకు మొదటి సంవత్సరం ఎకరాకు రూ.19,800, అరటికి రూ.16,800, బొప్పాయికి రూ.12,000, డ్రాగన్‌ఫ్రూట్‌కు రూ.36,000 చొప్పున సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. రెండో సంవత్సరం నిర్వహణకు కూడా ప్రభుత్వం సహాయం అందిస్తుందని పేర్కొన్నారు.

పూల సాగుతో స్వల్పకాలిక ఆదాయం:

దసరా, దీపావళి, అయ్యప్ప పూజలు, సంక్రాంతి, వివాహాది శుభకార్యాలు వరుసగా ఉండటంతో బంతి పూలకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉండే అవకాశం ఉందన్నారు. బంతి, గులాబీ, మల్లె, చామంతి తదితర పూల సాగుకు ఎకరాకు రూ.8,000 చొప్పున సహాయం అందిస్తున్నట్లు వివరించారు.

అలాగే ఉల్లి సాగుకు ఎకరాకు రూ.8,000, పసుపుకు రూ.16,000, మల్చింగ్‌ షీట్‌ కోసం రూ.6,400 చొప్పున రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు.
కూరగాయల పందిళ్లకు రూ.లక్ష వరకు సాయం
కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఆర్‌కేవీవై పథకం కింద తీగజాతి కూరగాయల సాగు కోసం శాశ్వత పందిళ్ల నిర్మాణానికి ఎకరాకు రూ.1 లక్ష వరకు ప్రభుత్వం సహాయం అందిస్తున్నట్లు శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు.

బీరకాయ, సొరకాయ, కాకరకాయ, దోసకాయ తదితర తీగజాతి కూరగాయలను పందిళ్లపై సాగు చేయడం ద్వారా అధిక దిగుబడితో పాటు మెరుగైన ఆదాయం పొందవచ్చని సూచించారు.

డ్రిప్‌, స్ప్రింక్లర్‌కు భారీ రాయితీలు:

నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునేందుకు ఆర్‌కేవై–పీడీఎంసీ పథకం కింద రైతుల వర్గీకరణను బట్టి డ్రిప్‌ సాగునీటి పరికరాలకు 70 శాతం నుంచి 90 శాతం వరకు రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, బీసీ చిన్న, సన్నకారు రైతులకు 80 శాతం, ఇతర వర్గాల రైతులకు 70 శాతం వరకు రాయితీ ఉంటుందని వివరించారు. స్ప్రింక్లర్‌ సాగునీటికి 50 శాతం రాయితీ అందిస్తున్నట్లు తెలిపారు.

ఆయిల్‌పామ్‌తో దీర్ఘకాలికంగా అధిక ఆదాయం
ఎన్‌ఎంఈఓ–ఓపీ పథకం కింద ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు నాలుగేళ్లలో కలిపి ఎకరాకు రూ.49 వేల వరకు వివిధ రూపాల్లో ప్రభుత్వం సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్‌ గెలల ధర టన్నుకు రూ.23,488గా ఉందన్నారు.

నాలుగో సంవత్సరం నుంచి తొలి దిగుబడి ప్రారంభమై ఎకరాకు 3–4 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఐదో, ఆరో సంవత్సరాల్లో 7–8 టన్నులకు, ఎనిమిదో సంవత్సరం నుంచి 10 టన్నుల వరకు దిగుబడి పొందే అవకాశం ఉందని వివరించారు. అనుకూల పరిస్థితుల్లో దీర్ఘకాలికంగా ఎకరాకు రూ.2 లక్షల వరకు నికర ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.

రైతులు తమ భూమి స్వభావం, నీటి వనరులు, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా దీర్ఘకాలిక పంటలైన ఆయిల్‌పామ్‌, పండ్ల తోటలతో పాటు స్వల్పకాలిక ఆదాయాన్ని అందించే కూరగాయలు, పూలను సమన్వయంతో సాగు చేయాలని సూచించారు.

పెద్దపల్లి జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచడమే ఉద్యానశాఖ లక్ష్యమని జిల్లా ఉద్యానశాఖ అధికారి గడ్డం శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. ప్రభుత్వ రాయితీలు, పథకాల వివరాలు, అర్హతల కోసం రైతులు సమీప ఉద్యానశాఖ అధికారులను లేదా పెద్దపల్లిలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని జిల్లా ఉద్యానశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.