22ఏ.భూములపై ఆధారాలతోనే నిర్ణయాలు
నిజమైన ప్రైవేట్ భూముల సమస్యలు 48 గంటల్లో పరిష్కరించాలి..
ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ వద్దు: కలెక్టర్ కోయ శ్రీహర్ష….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/ : 22ఏ.నిషేధిత భూములకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి ఆధారాలు, భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. 22ఏ జాబితాలో చేర్చే ప్రతి భూమికి స్పష్టమైన ఆధారాలు ఉండాలని, నిజమైన ప్రైవేట్ భూములు పొరపాటున జాబితాలో నమోదైతే వాటి సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు.
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి 22ఏ నిషేధిత భూముల జాబితాపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తున్న ఫిర్యాదులు, భూ రికార్డుల పరిశీలన, 22ఏ జాబితాలో భూముల చేర్పు, తొలగింపు ప్రక్రియ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏదైనా ప్రైవేట్ భూమి పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో నమోదైనట్లు నిర్ధారణ అయితే సర్వే నంబర్ వారీగా తొలగించిన భూముల జాబితా రూపొందించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. భూములను 22ఏ జాబితాలో చేర్చేటప్పుడు అనుసరించే విధానాన్నే తొలగింపు ప్రక్రియలోనూ పాటించాలని సూచించారు.
తొలగించే ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించి నిర్దిష్ట కారణాలు, స్పష్టమైన రిమార్కులు తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 22ఏ భూముల పరిశీలన, తొలగింపునకు ఒకే విధమైన ప్రక్రియ, ఫార్మాట్ రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 22ఏ. భూముల సమస్యలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. నిజమైన ప్రైవేట్ భూములకు సంబంధించిన సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సాధ్యమైన చోట 48 గంటల్లో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదే సమయంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి ఫిర్యాదును రికార్డుల ఆధారంగా పరిశీలించి, నిబంధనల ప్రకారమే తుది నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్డీఓ గంగయ్య, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST