పోలీసు సేవలకు ఘన సన్మానం.. కుటుంబంతో ఆనందంగా గడపండి….

Sakshitha news

పోలీసు సేవలకు ఘన సన్మానం.. కుటుంబంతో ఆనందంగా గడపండి….

ఉద్యోగ విరమణ పొందిన అధికారులు రాబోయే తరానికి స్ఫూర్తి….

— సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : తమ కుటుంబ సంక్షేమం కంటే సమాజ సంక్షేమానికే ప్రాధాన్యమిస్తూ నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులేనని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు.

ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు ఇకపై తమ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఎం. రవీందర్‌ (ఎస్‌ఐ), బసవ దీపక్‌ (ఏఎస్‌ఐ), దుంపల కొమురయ్య (ఏఎస్‌ఐ), చిలుముల మధునయ్య (హెడ్‌ కానిస్టేబుల్‌)లను కమిషనర్‌ ఘనంగా సన్మానించారు. పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి పూలమాలలు వేసి, జ్ఞాపికలు అందజేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసులు తమ కుటుంబ క్షేమాన్ని పక్కనపెట్టి సమాజ భద్రత కోసం నిరంతరం సేవలందిస్తారని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందుతున్న అధికారులు తమ సుదీర్ఘ సేవా కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని, శాంతిభద్రతల పరిరక్షణలో కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారని కొనియాడారు.

వారి సేవలు రాబోయే తరాల పోలీసు అధికారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిత్యం యోగా, వ్యాయామం చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ సుఖసంతోషాలతో జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్‌) కె. శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్‌, ఆర్‌ఐ రమేష్‌, సీసీ సందీప్‌, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.